ENGLISH | TELUGU  

టాలీవుడ్‌లో ఆశ‌లురేపి అంత‌లోనే ఫేమ్ కోల్పోయిన‌ ప‌దిమంది యాక్ట‌ర్లు!

on Jun 18, 2021

 

తెలుగు చిత్ర‌సీమ‌లో ప‌లువురు న‌టులు.. హీరోలుగా ఎంట్రీ ఇచ్చి, ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. కొంత‌మంది సంచ‌ల‌నాలు సృష్టించి, భ‌విష్య‌త్తుపై ఆశ‌లు రేపారు. ఇంకొంత‌మంది సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చినా, త‌ర్వాత కొన్ని క్రేజీ సినిమాల‌తో టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారారు. వారిలో వార‌సులుగా రంగ‌ప్ర‌వేశం చేసిన వారున్నారు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేక‌పోయినా ఎన్నో క‌ల‌ల‌తో న‌టులుగా వెలిగిపోవాల‌ని వ‌చ్చిన వాళ్లున్నారు. కానీ కొంత‌మంది న‌టుల విష‌యంలో ఘ‌న‌మైన వార‌సత్వం కూడా ఉప‌యోగ‌ప‌డ‌లేదు. క్ర‌మేపీ వారు అవ‌కాశాల‌ను, త‌ద్వారా ప్రేక్ష‌కాద‌ర‌ణ‌నూ కోల్పోయి తెర‌మ‌రుగైపోయారు. స్వ‌యంకృషితో ఎదుగుదామ‌ని వ‌చ్చిన మ‌రికొంత‌మందికి స‌రైన అవ‌కాశాలు ఇచ్చేవారు లేక కాల‌క్ర‌మంలో కెరీర్‌లో కింద‌కు ప‌డిపోయారు. అలాంటి ఓ ప‌దిమంది న‌టులెవ‌రో ఓ లుక్కేసేద్దాం...


ర‌మేశ్‌బాబు
సూప‌ర్‌స్టార్ కృష్ణ వార‌సుడిగా చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టి 'సామ్రాట్' మూవీతో యాక్ష‌న్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు ర‌మేశ్‌బాబు. 'బ‌జార్ రౌడీ', 'క‌లియుగ క‌ర్ణుడు', 'ముగ్గురు కొడుకులు' లాంటి హిట్ సినిమాల్లో న‌టించిన ఆయ‌న తండ్రితో క‌లిసి న‌టించిన 'ఎన్‌కౌంట‌ర్' (1997) త‌ర్వాత న‌ట‌న‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పేశాడు. న‌ట‌న మీద ఆస‌క్తి స‌న్న‌గిల్ల‌డం, సోలో హీరోగా క్రేజ్ కోల్పోవ‌డం, స‌రైన ఫిజిక్ మెయిన్‌టైన్ చెయ్య‌క‌పోవ‌డం ఆయ‌న తెర‌మ‌రుగు కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు.

వ‌డ్డే న‌వీన్‌
'పెళ్లి' లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీలో హీరోగా న‌టించి ఆక‌ట్టుకున్న స్ఫుర‌ద్రూపి వ‌డ్డే న‌వీన్.. 'ప్రియా ఓ ప్రియా', 'చాలా బాగుంది', 'మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది', 'నా ఊపిరి' లాంటి చ‌క్క‌ని సినిమాల్లో న‌టించాడు. కానీ త‌ర్వాత కాలంలో క‌రిష్మాను, త‌ద్వారా అవ‌కాశాల‌నూ కోల్పోయాడు. ఆయ‌న తెర‌మీద క‌నిపించి నాలుగేళ్లు పైనే అయ్యింది.

జె.డి. చ‌క్ర‌వ‌ర్తి
'శివ' మూవీలో నెగ‌టివ్ రోల్ చేయ‌డం ద్వారా అంద‌రి దృష్టిలో ప‌డిన జె.డి. చ‌క్ర‌వ‌ర్తి, మ‌నీ, గులాబీ, అన‌గ‌న‌గా ఒక‌రోజు, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావుర‌మా లాంటి హిట్ మూవీస్‌లో హీరోగా న‌టించి యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆర్జీవీ రూపొందించిన 'స‌త్య' సినిమా ఆయ‌న ఇమేజ్‌ను ప‌దిరెట్లు పెంచింది. కానీ త‌ర్వాత కాలంలో ఆ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లు స‌బ్జెక్టులు ఎంచుకోక‌పోవ‌డంతో త్వ‌ర‌గానే హీరోగా ఫేడ‌వుట్ అవుతూ వ‌చ్చాడు. చివ‌ర‌కు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. జె.డి. ఇప్ప‌టి ప‌రిస్థితి ఆయ‌న స్వ‌యంకృతాప‌రాధ‌మే అనేది విమ‌ర్శ‌కుల మాట‌.

త‌రుణ్‌
చైల్డ్ ఆర్టిస్‌గా న‌టించిన తొలి చిత్రం 'మ‌న‌సు మ‌మత' (1990) తోటే ఉత్త‌మ బాల‌న‌టుడిగా నంది అవార్డు, అదే ఏడాది న‌టించిన మ‌ణిర‌త్నం చిత్రం 'అంజ‌లి'తో ఉత్త‌మ బాల‌న‌టుడిగా నేష‌న‌ల్ అవార్డు అందుకున్న ఘ‌న‌మైన చ‌రిత్ర త‌రుణ్‌ది. ఇక 2000 సంవ‌త్స‌రంలో 'నువ్వే కావాలి'తో హీరోగా ప‌రిచ‌య‌మై సంచ‌ల‌నం సృష్టించాడు. 'ప్రియ‌మైన నీకు', 'నువ్వు లేక నేను లేను', 'నువ్వే నువ్వే' లాంటి హిట్ సినిమాలు చేశాక ఫ్లాపుల ప‌రంప‌ర కొన‌సాగ‌డంతో లేచిప‌డిన కెర‌టంలా మారాడు. 2003 నుంచి అత‌డు న‌టించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్‌ను గెల‌వ‌లేదంటే స‌బ్జెక్టుల ఎంపిక‌లో అత‌డు చేసిన పొర‌పాట్లేన‌ని చెప్పాలి. దానికి తోడు కాంట్ర‌వ‌ర్సీస్ కూడా అత‌డి కెరీర్‌ను ప్ర‌భావితం చేశాయి.

వేణు
'స్వ‌యంవ‌రం' లాంటి హిట్ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు వేణు. చిరున‌వ్వుతో, హ‌నుమాన్ జంక్ష‌న్‌, పెళ్లాం ఊరెళితే, ఖుషీ ఖుషీగా, గోపి గోపిక గోదావ‌రి లాంటి సినిమాల‌తో అల‌రించిన ఆయ‌న ఆ త‌ర్వాత అనూహ్యంగా అటు అవ‌కాశాలు, ఇటు ప్రేక్ష‌కాద‌ర‌ణ కోల్పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. 'ద‌మ్ము' సినిమాలో జూనియ‌ర్ ఎన్టీఆర్ బావ‌గా క‌నిపించాక, 'రామాచారి' (2013) సినిమాలో హీరోగా న‌టించాడు. ఆ త‌ర్వాత న‌ట‌న‌కు దూర‌మై బిజినెస్ రంగంలో స్థిర‌ప‌డ్డాడు.

రాజా
శేఖ‌ర్ క‌మ్ముల సినిమా 'ఆనంద్‌'తో వెలుగులోకి వ‌చ్చి ఆక‌ట్టుకున్న రాజా.. క్రేజీ హీరోగా నిల‌దొక్కుకుంటాడ‌ని అంతా ఆశించారు. 'ఆ న‌లుగురు', 'వెన్నెల' లాంటి సినిమాలు చేశాక‌.. హీరోగా అత‌డు ఎంచుకున్న స‌బ్జెక్టులు, చేసిన పాత్ర‌లు అత‌డికి క‌లిసి రాలేదు. క్ర‌మేణా క‌రిష్మా కోల్పోతూ వ‌చ్చిన అత‌ను 2013 త‌ర్వాత మ‌ళ్లీ వెండితెర‌పై క‌నిపించ‌లేదు. రెండు మూడు ప్రాజెక్టులు అనౌన్స్ అయ్యాక ఆగిపోవ‌డంతో సినిమాల‌పై విముఖ‌త ఏర్ప‌డిన రాజా, చివ‌ర‌కు హైద‌రాబాద్‌లోనే పాస్ట‌ర్‌గా స్థిర‌ప‌డ్డాడు.

తార‌క‌ర‌త్న‌
నంద‌మూరి వంశ వార‌సుడిగా 2002లో ఎంట్రీ ఇచ్చి, ఏకంగా తొమ్మిది సినిమాలను ప్రారంభించి అంద‌రి దృష్టినీ త‌న‌వేపుకు తిప్పుకున్నాడు తార‌క‌ర‌త్న‌. కానీ వాటిలో కొన్ని మాత్ర‌మే సెట్స్ మీద‌కు వెళ్లాయి. ఆ వెళ్లిన‌వి కూడా స‌రిగా ఆడ‌క‌పోవ‌డంతో ఎంత ఆర్భాటంగా ఎంట్రీ జ‌రిగిందో, అంతే అనూహ్యంగా కెరీర్‌లో వెన‌క‌బ‌డి పోయాడు. 20 సినిమాలు చేసినా ఒక్క హిట్టూ ద‌క్క‌ని హీరోగా బ్యాడ్ రికార్డ్ పొందాడు తార‌క‌ర‌త్న‌. నెగ‌టివ్ రోల్ చేసిన 'అమ‌రావ‌తి' మాత్ర‌మే అత‌డికి సంతృప్తినిచ్చింది. నాలుగేళ్లుగా అత‌ను తెర‌పై క‌నిపించ‌లేదు.

వ‌రుణ్ సందేశ్‌
డ్రీమ్ స్టార్టింగ్ అంటే వ‌రుణ్ సందేశ్‌దే. తొలి రెండు చిత్రాలు హ్యాపీ డేస్‌, కొత్త బంగారులోకం హిట్ల‌తో అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు అనిపించుకున్నాడు వ‌రుణ్‌. కానీ ఆ త‌ర్వాత 20 సినిమాలు చేసినా అత‌డికి ద‌క్కింది ఏమైంది ఈవేళ అనే ఒక్క హిట్టే. ఆదిలో వ‌చ్చిన క్రేజ్‌ను స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో ఫెయిలై, స‌బ్జెక్టుల ఎంపిక‌లో అత‌ను త‌ప్ప‌ట‌డుగులు వేశాడు. ఆరంభంలో మెరుపులా మెరిసిన అత‌ను క్ర‌మేపీ, వెలుగును త‌గ్గించుకుంటూ వ‌చ్చాడు. ఇప్పుడ‌త‌నికి క‌నీస మార్కెట్ లేదు.

నారా రోహిత్‌
'బాణం' మూవీతో స‌ర్‌ప్రైజింగ్ ఎంట్రీ ఇచ్చి ఆక‌ట్టుకుని, రెండో సినిమా 'సోలో'తో క‌మ‌ర్షియ‌ల్ హిట్ సాధించాడు నారా రోహిత్‌. ఆ త‌ర్వాత కొన్ని ఆస‌క్తిక‌ర సినిమాలు చేసినా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆశించిన ఫ‌లితాలు ద‌క్క‌క‌పోవ‌డంతో, క్ర‌మేపీ ప్రేక్ష‌కుల ఆస‌క్తిని కోల్పోయాడు. త‌ర్వాత కాలంలో అత‌డు ఎంచుకున్న స‌బ్జెక్టులు కూడా రోహిత్ కెరీర్‌కు ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌లేదు. నారా వారి ఫ్యామిలీ నుంచి వ‌చ్చి, అద్భుతాలు సృష్టిస్తాడ‌నుకున్న రోహిత్ నిరాశ‌ప‌రిచాడు.

త‌నీష్‌
చైల్డ్ ఆర్టిస్టుగా ప్రేక్ష‌కుల్ని అల‌రించిన త‌నీష్.. 'న‌చ్చావులే' లాంటి హిట్ సినిమాతో హీరోగా మారాడు. 'రైడ్‌', 'మేం వ‌య‌సుకు వ‌చ్చాం' లాంటి స‌క్సెస్‌ఫుల్ సినిమాల త‌ర్వాత క్ర‌మేపీ కెరీర్‌లో డౌన్‌ఫాల్ అవుతూ వ‌చ్చాడు. 'న‌క్ష‌త్రం' మూవీలో చేసిన నెగ‌టివ్ రోల్ కూడా అత‌డికి ఉప‌యోగ‌ప‌డ‌లేదు. ప్ర‌స్తుతం అత‌డి చేతిలో చెప్పుకోద‌గ్గ సినిమాలేవీ లేవు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.